అంతర్జాతీయం
యునెస్కో రక్షిత జీవావరణ రిజర్వుల జాబితాలోకి అగస్త్యమల ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో జీవావరణ రిజర్వుల జాబితాలో భారత్‌లోని పశ్చిమ కనుమల్లోని అగస్త్యమల ప్రాంతానికి చోటు దక్కింది. పెరూ రాజధాని లిమాలో మార్చి 19న ముగిసిన యునెస్కో అంతర్జాతీయ సమన్వయ మండలి సమావేశంలో కొత్తగా వివిధ దేశాలకు చెందిన 20 జీవావరణ రిజర్వులను వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చారు. దీంతో మొత్తం 120 దేశాల్లో ఉన్న రిజర్వ్‌ల సంఖ్య 669కి చేరింది. కేరళ, తమిళనాడుల్లోని పశ్చిమ కనుమల్లో ఉన్న అగస్త్యమల ప్రాంతంలో 2,254 ఎత్తై జాతి రకానికి చెందిన మొక్కలతో పాటు 400 విశిష్ట లక్షణాలున్న మొక్కలున్నాయి. రష్యాలో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం మార్చి 19 వేకువజామున దక్షిణ రష్యాలోని రోస్తోవ్ ఓన్ డాన్ పట్టణంలో జరిగింది. దుబాయ్‌కి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థ విమానం.. విమానాశ్రయంలో దిగటానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో నిట్టనిలువునా నేలను ఢీకొంది. ఫలితంగా జరిగిన భారీ పేలుడు వల్ల విమానంలో ఉన్న 62 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. 37వ సార్క్ మంత్రుల సమావేశం సార్క్ దేశాల మంత్రుల 37వ సమావేశం నేపాల్‌లోని పొఖారాలో మార్చి 14 నుంచి 17 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమావేంలో పాల్గొని ప్రసంగించారు. సార్క్ దేశాలను మరింత అనుసంధానం చేసేందుకుగాను దక్షిణాసియా ఆర్థిక సంఘం(ఎస్‌ఏఈయూ)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్)లోని ఎనిమిది సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సార్క్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘానిస్తాన్, మాల్దీవులు సభ్య దేశాలుగా ఉన్నాయి. 88 ఏళ్ల తరువాత క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ఎనిమిదిన్నర దశాబ్దాల యుద్ధ మేఘాల్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబ సమేతంగా మార్చి 20న క్యూబా పర్యటన ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక విదేశాంగ విధానానికి నాంది పలకనుంది. 1959లో ప్రభుత్వాన్ని కూలదోసి ఫిడెల్ క్యాస్ట్రో అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి క్యూబాను అమెరికా శత్రుదేశంగా భావిస్తూ వచ్చింది. అంతర్జాతీయంగా క్యూబాను ఏకాకి చేసే ప్రయత్నమూ జరిగింది. 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటిస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. బ్రసెల్స్‌లో బాంబు పేలుళ్లు: 35 మంది మృతి యూరోప్‌లోని బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లు సృష్టించారు. మార్చి 22న బ్రసెల్స్‌లోని జావెంటెమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్లకు, యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం దగ్గర్లోని భూగర్భ మెట్రోస్టేషన్లో ఓ భారీ విస్ఫోటనానికి పాల్పడి 34 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ పేలుళ్లలో మరో 200 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్లలో 14 మంది, మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్ల క్షతగాత్రుల్లో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు భారతీయ ఉద్యోగులు నిధి చాపేకర్, అమిత్ మోత్వానీ ఉన్నారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ప్రకటించింది. జాతీయం కృషి ఉన్నతి మేళాకు శ్రీకారం వరుస కరువులు.. వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రైతులు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో మార్చి 19న మూడు రోజుల కృషి ఉన్నతి మేళాను ప్రారంభించిన ఆయన నీటి పొదుపుతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిందిగా రైతులను కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 80 లక్షల హెక్టార్లకు సాగునీరందించే 90 సాగునీటి ప్రాజెక్టులను గుర్తించినట్లు ప్రధాని తెలిపారు. పాలన, మెరుగైన జీవనంలో ముంబై, తిరువనంతపురం టాప్ దేశంలోని నగరాల్లో ముంబై, తిరువనంతపురం పాలన, మెరుగైన జీవనంలో ఉమ్మడిగా తొలిస్థానంలో నిలిచాయి. 21 నగరాల్లో సర్వేచేయగా చండీగఢ్, జైపూర్ అట్టడుగు స్థానాల్లో ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రణాళిక, డిజైన్, సామర్థ్యం, వనరులు, పారదర్శకత తదితర అంశాల ఆధారంగా జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్ షిప్ అండ్ డెమోక్రసీ సర్వే నిర్వహించింది. 0-10 రేటింగ్ స్కేల్‌పై తిరువనంతపురం, ముంబైలు 4.2 రేటింగ్‌ను సాధించాయి. స్వచ్ఛ రైల్వేస్టేషన్లుగా సూరత్, రాజ్‌కోట్ దేశంలోని 10 పరిశుభ్ర రైల్వేస్టేషన్లలో గుజరాత్‌లోని సూరత్, రాజ్‌కోట్ రైల్వేస్టేషన్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అత్యంత పరిశుభ్రమైన రైల్వేస్టేషన్లను ఎంపిక చేయడం కోసం 16 రైల్వే జోన్లలోని 407 స్టేషన్లలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వే వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు మార్చి 17న వెల్లడించారు. 75 ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో సూరత్, రాజ్‌కోట్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. సోలాపూర్, ముంబై సెంట్రల్, ఛండీగఢ్, భువనేశ్వర్, వడోదర రైల్వే స్టేషన్‌లు వరుసగా తరవాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయి, పుణే రైల్వే స్టేషన్‌లు దేశంలోనే అతిచెత్త రైల్వే స్టేషన్‌లుగా నిలిచాయి. పోఖ్రాన్‌లో ‘ఐరన్ ఫిస్ట్-2016’ విన్యాసాలు రాజస్థాన్ థార్ ఎడారిలోని పోఖ్రాన్ అణ్వస్త్ర ప్రయోగ భూమిలో మార్చి 18న భారత వైమానిక విన్యాసాలు జరిగాయి. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో ‘ఐరన్ ఫిస్ట్-2016’ పేరిట విన్యాసాలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 22 రకాల యుద్ధ వైమానిక వేదికల నుంచి ఆయుధ వ్యవస్థలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. గాలిలో నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే తేలికపాటి యుద్ధవిమానం తేజస్, భూమి నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే ఆకాశ్ క్షిపణిని ఇందులో ప్రదర్శించారు. ఫైటర్ జెట్‌లు సుఖోయ్-30, మిరేజ్-2000, మిగ్-27, జాగ్వర్‌లు ఆకాశంలో సందడి చేశాయి. రాత్రిపూట నిర్వహించిన ప్రదర్శనలో 180 యుద్ధవిమానాలు సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. విన్యాసాలను రాష్ట్రపతితో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీక్షించారు. ఎక్సర్‌సైజ్ ఐరన్ ఫిస్ట్‌ను 2013లో మొదటిసారి నిర్వహించారు. క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్లు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల కనీస మందాన్ని 50 మైక్రాన్లకు పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకన్నా తక్కువ మందం ఉన్న బ్యాగులను నిషేధించినట్లు మార్చి 18న ప్రకటించింది. పెళ్లిళ్లు, రాజకీయ పార్టీల ర్యాలీలు, మత కార్యక్రమాలు, ఇతర సామూహిక కార్యక్రమాలు జరిగిన వేదికల వద్ద పోగుబడిన ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేసే బాధ్యత ఆయా కార్యక్రమాల నిర్వాహకులదేనని ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016’లో స్పష్టం చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్, బయో మెడికల్, నిర్మాణం.. తదితర రంగాల్లోని వ్యర్థాల నిర్వహణ నిబంధనలనూ చేర్చారు. పల్లెల్లోనూ ఈ నిబంధనల పరిధిలోకి చేర్చారు. ప్రభుత్వ ప్రకటనలపై ఆదేశాలు సవరించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలు కూడా వేసుకోవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రకటనలపై కేవలం ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని 2015 మే 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు సమాఖ్య వ్యవస్థకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంటూ.. వీటిని పునఃసమీక్షించాలని కేంద్రంతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, తదితర ఏడు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు పాత ఆదేశాలను సవరించింది. దీనిప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధానికి బదులుగా ఆయా శాఖల కేబినెట్ మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల ఫొటోలూ వేసుకోవచ్చు. అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి బదులుగా ఆయా శాఖల కేబినెట్ మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల ఫొటోలు వేసుకోవచ్చు. అంబేడ్కర్ స్మారకోపన్యాసం చేసిన మోదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో అంబేద్కర్ స్మారకానికి మార్చి 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి అనంతరం స్మారకోపన్యాసం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని మోదీ స్పష్టం చేశారు. నల్లవారి హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్‌తో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను పోల్చారు. తాను ఇంతకుముందే చెప్పినట్లు సాక్షాత్తూ అంబేద్కరే వచ్చినా ఇప్పుడు దళితుల హక్కును లాగేసుకోలేరని మోదీ చెప్పారు. ఇప్పటిదాకా ఆరుసార్లు అంబేద్కర్ స్మారక ఉపన్యాసం నిర్వహిస్తే దేశ ప్రధాని ప్రసంగించడం ఇదే మొదటిసారి. సురక్షిత నీరందని వారు భారత్‌లోనే అధికం ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేక అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నది భారత్‌లోనే అన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 7.6 కోట్ల మంది ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. టాప్ 10 జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, నైజీరియా ఉన్నాయని వాటర్‌ఎయిడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. పాక్ పదో స్థానంలో నిలిచింది. మంచి నీటి కోసం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొందని, నీటి వనరుల అస్తవ్యస్త నిర్వహణే దీనికి ప్రాథమిక కారణమని తేల్చింది. ప్రాజెక్టుల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడమో లేదా పైపులైన్లు లేకపోవడం వల్లనో ప్రజలకు నీరు అందడం లేదని పేర్కొంది. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. అటల్ పెన్షన్ యోజనకు సవరణలు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మార్చి 22న ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా సవరణ ప్రకారం.. ఏపీవై చందాదారులెవరైనా మరణించినా వారి భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి) ఈ పెన్షన్ ఖాతాను కొనసాగించవచ్చు. నిర్ణీత గడువు పూర్తయ్యే వరకూ (చందాదారుడికి 60 ఏళ్లు పూర్తయి ఉండే సమయం వరకు) వారు చందా చెల్లిస్తే... వారికి జీవితాంతం నెలనెలా నిర్ధారిత పెన్షన్ మొత్తం అందుతుంది. భాగస్వామి కూడా మరణించాక వారి నామినీకి ఏకమొత్తంగా పెన్షన్ సొమ్మును చెల్లిస్తారు. రాష్ట్రీయం తెలంగాణలో ‘ఎయిర్‌బస్’ హెలికాప్టర్ల తయారీ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ఎయిర్‌బస్ ఆసక్తిని కనబరచింది. దీని కోసం రూ.120 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఏటా వంద నేవీ, యుటిలిటీ హెలికాఫ్టర్ల తయారీ సామర్థ్యం గల పరిశ్రమ స్థాపన కోసం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 40 ఎకరాలు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం రాష్ట్రంలో అందరికీ డిజిటల్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఫైబర్ గ్రిడ్ మొదటి దశను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మార్చి 17న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15 ఎంబీపీఎస్‌తో ఇంటర్నెట్, 100 టీవీ చానళ్లు, టెలిఫోన్ సౌకర్యం కల్పించనున్నారు. రూ.333 కోట్ల వ్యయంతో ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్), ఐటీ సంస్థ సిస్కోతో కలసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. వైమానిక సంస్థలతో టాస్క్ ఎంవోయూ వైమానిక రంగంలో ప్రఖ్యాతి గాంచిన యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్, ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) మార్చి 17న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు వైమానిక రంగంలో నైపుణ్యాలు, శిక్షణ, పరిశోధన అవకాశాలను కల్పించడమే ఈ ఎంవోయూ ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్‌లోని ప్రాట్-వెట్నీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శిక్షణ కేంద్రంలో యువతకు, అధ్యాపకులకు ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ అకడమిక్ శిక్షణ అందిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా ఆయా సంస్థలతో కలసి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ద్వైపాక్షికం బంగ్లాదేశ్‌కు భారత్ విద్యుత్ బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. మార్చి 23 నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్ ఇంటర్‌నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని, ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుం దని మోదీ అభివర్ణించారు. ఇప్పటికే మనకు పశ్చిమ, దక్షిణ ఇంటర్నెట్ గేట్‌వేలు ఉన్నాయని, ఇప్పుడు తూర్పున కూడా ప్రధానమైన ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడిందని మోదీ అన్నారు. బంగ్లాతో ఏర్పడిన ఈ ఈశాన్య గేట్‌వే అస్సాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు కనెక్టివిటీని ఏర్పరచిందన్నారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేసిన 400 కేవీడీసీ లైన్ల ద్వారా త్రిపుర నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఆర్థికం ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం -0.91 మార్చి 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం(2015, ఫిబ్రవరితో పోల్చి చూస్తే) -0.91గా నమోదైంది. ద్రవ్యోల్బణం మైనస్‌ల్లో కొనసాగడం ఇది వరుసగా 16వ నెల. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో (2015, ఫిబ్రవరితో పోల్చి చూస్తే) 5.18 శాతంగా నమోదైంది. ఇది గత నెలలో 5.69 శాతంగా ఉంది. రష్యాలో చమురు క్షేత్రాల కొనుగోలుకు ఓవిఎల్, ఐఓసీ ఒప్పందాలు రష్యాలోని రెండు చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవిఎల్), ఆయిల్ ఇండియా కార్పొరేషన్ సారథ్యంలోని కన్సార్షియం మార్చి 16న సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.28,253 కోట్లు. ఈ కన్సార్షియం యురియక్ చమురు క్షేత్రంలోని 29.9 శాతం వాటాను రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ నుంచి కొనుగోలు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంగారక గ్రహానికి రష్యా-ఐరోపా వ్యోమనౌక అంగారక గ్రహంపై జీవం ఉనికిని గుర్తించేందుకు రష్యా-ఐరోపాలు సంయుక్తంగా ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టీజీవో) వ్యోమనౌకను ప్రయోగించాయి. దీన్ని ప్రోటాన్ రాకెట్ ద్వారా మార్చి 14న కజికిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ నౌక 49.6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఏడాది అక్టోబర్‌లో అంగారక గ్రహాన్ని చేరనుంది. ఇది అరుణ గ్రహాన్ని చిత్రీకరించడంతో పాటు అక్కడి గాలిని విశ్లేషించననుంది. అంగారకుడిపై మీథేన్‌ను విశ్లేషించడమే ప్రధాన లక్ష్యంగా తాజా ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి ఎక్సో మార్స్-2016గా పేరుపెట్టారు. అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ ఈ క్షిపణిని పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడంతో పాటు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఐసీజీఎస్ అర్ణవేష్ జలప్రవేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ అర్ణవేష్’ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మార్చి 21న విశాఖపట్నంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇండయన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఈ వేగవంతమైన పెట్రోల్ వెసల్ (FPV)ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునిక నైట్‌విజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక ముందు భాగంలో 40/60 భోఫోర్స్ గన్‌ను అమర్చారు. ఈ నౌకలో ఆరుగురు అధికారులతోపాటు 34మంది నౌకాదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వార్తల్లో వ్యక్తులు అమెరికా ఐఎస్‌ఏ అధ్యక్షుడిగా భారత ప్రొ.టి.వి.పాల్ అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) 56వ అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ప్రొఫెసర్ టి.వి.పాల్ మార్చి 18న నియమితులయ్యారు. ఐఎస్‌ఏ అనేది మేధావులతో కూడిన ఓ ప్రతిష్టాత్మక సంఘం. కేరళకు చెందిన పాల్ ప్రస్తుతం మాంట్రియల్(కెనడా)లోని జేమ్స్ మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతి ప్రముఖ షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్(77) మార్చి 16న కోల్‌కతాలో మరణించారు. హుస్సేన్ హిందూస్థానీ వాయిద్యం షెహనాయి వాయించడంలో బిస్మిల్లాఖాన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలను సాధించారు. ఆయనకు 2009లో సంగీత నాటక అకాడెమీ అవార్డు లభించింది. మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటించేందుకు వాటికన్ సిటీ మార్చి 15న ఆమోదం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4న అధికారికంగా ఆమెకు సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నట్లు కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని సెయింట్‌గా ప్రకటించేందుకు రెండు అద్భుతాలు జరిగుండాలి. థెరిసా మహిమతో 1998లో బెంగాలీ గిరిజన మహిళ అనారోగ్యం నుంచి కోలుకోవడం, 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడిన సంఘటనలను సెయింట్ హుడ్ ప్రకటనకు పరిగణలోకి తీసుకున్నారు. అవార్డులు వెంకయ్యకు స్కోచ్ చాలెంజర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును స్కోచ్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం(స్కోచ్ చాలెంజర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్)తో మార్చి 18న సత్కరించింది. అలాగే ‘చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ స్టార్టప్ ఇండియా’ను తెలంగాణా ఐటి మంత్రి కె. తారక రామారావుకు స్కోచ్ సంస్ధ అందజేసింది. ‘25 ఏళ్ల భారత సంస్కరణల’పై స్కోచ్ నిర్వహించిన సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పురస్కారాలను అందజేశారు. ఏపీ, టీఎస్‌ఆర్‌టీసీలకు జాతీయ అవార్డులు ఇంధన పొదుపులో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మొదటి స్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందజేసే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 22న బెంగళూరులో జరిగింది. దేశంలోని ఇతర రవాణా సంస్థలతో పోలిస్తే అత్యంత ఎక్కువ కేఎంపీఎల్ అందజేస్తున్న సంస్థగా (లీటరుకు 5.46 కిలోమీటర్లు) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవార్డును అందుకుంది. ఇదే సందర్భంలో 2013-14, 2014-15 సంవత్సరాల్లో పోల్చిచూసినపుడు ఏడాదిలో సంస్థ కేఎంపీఎల్ సామర్థ్యాన్ని 5.41 నుంచి 5.46 కిలోమీటర్లు పెంచడం ద్వారా రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)కు సైతం నాలుగు అవార్డులు దక్కాయి. 2014-15 సంవత్సరానికి గాను గ్రామీణ సర్వీసులలో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్ (పన్ను ఎలిమెంట్ లేకుండా కి.మీ.కు రూ. 26.02 వ్యయం) కలిగి ఉన్నందుకు ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డులు లభించాయి. జగదీశ్ చంద్‌కు కీర్తిచక్ర ప్రదానం పఠాన్‌కోట్ దాడి ఘటనలో విరోచితంగా పోరాడి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి మృతిచెందిన సిపాయి జగదీశ్ చంద్‌ను కేంద్రం కీర్తి చక్రతో గౌరవించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించి, అత్యున్నత, అసాధారణ సేవలు కనబరిచిన సైనికులకు ఇచ్చే శౌర్య అవార్డుల ప్రదానోత్సవం మార్చి 22న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రాణాలు సైతం లెక్క చేయక పలు సందర్భాల్లో సేవలు అందించిన మొత్తం 58 మందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతకాలను అందజేశారు. జగదీశ్ చంద్ తరఫున ఆయన భార్య కీర్తిచక్ర (సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం) అవార్డును అందుకున్నారు. 2015 జనవరి 27న జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రతిభ కనబరిచి మృతిచెందిన ఎంఎన్ రాయ్‌కి శౌర్య పతకాన్ని బహూకరించారు. ఆయన కూతురు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2015 జూన్ 8న ఇండో-మయన్మార్ సరిహద్దులో జరిగిన ఘటనలో సత్తా చాటిన హవిల్దార్ తన్కా కుమార్ సహా మరికొందరికి శౌర్య పతకాలను అందజేశారు. వైస్ అడ్మిరల్ మురుగేషన్‌కు పరమ్ విశిష్ట్ సేవా మెడల్ బహూకరించారు. క్రీడలు రోస్‌బర్గ్‌కు ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ గెలుచుకున్నాడు. మెల్‌బోర్‌నలో మార్చి 20న జరిగిన పోటీలో రోస్‌బర్గ్ తొలిస్థానంలో నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓఎన్‌జీసీ, కేరళకు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ కప్ టైటిల్స్ ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్ పురుషుల టైటిల్‌ను ఓఎన్‌జీసీ (డెహ్రాడూన్), మహిళల టైటిల్‌ను కేరళ గెలుచుకున్నాయి. పనాజీలో మార్చి 14న జరిగిన ఫైనల్స్‌లో ఐఓబీపై ఓఎన్‌జీసీ గెలుపొందగా, ఛత్తీస్‌గఢ్‌ను కేరళ ఓడించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో గుర్మీత్‌కు స్వర్ణం భారత్‌కు చెందిన వాకర్ గుర్మీత్ సింగ్ ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. జపాన్‌లోని నోమిలో మార్చి 20న జరిగిన రేస్‌లో గుర్మీత్‌కు స్వర్ణం దక్కగా, ఇసాము పుజిసావా (జపాన్) రజతం, జియోర్జి షెకో (కజకిస్థాన్) కాంస్య పతకాలను సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్మీత్‌సింగ్ గుర్తింపు పొందాడు. స్విస్ ఓపెన్ విజేత ప్రణయ్ భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్.ఎస్.ప్రణయ్ తన ఖాతాలో రెండో గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మార్చి 20న ముగిసిన స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఈ కేరళ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ ప్రణయ్ 19వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)పై గెలిచాడు. ప్రణయ్ తొలిసారి 2014లో ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను సాధించాడు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా ప్రణయ్ గుర్తింపు పొందాడు. 2015లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ రెండుసార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ వెల్స్ ఓపెన్ విజేత జొకోవిచ్ ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ గెలుచుకున్నాడు. దీంతో వరుసగా మూడో ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకొని హ్యాట్రిక్ సాధించాడు. ఫైనల్లో జొకోవిచ్ 6-2, 6-0తో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన జొకోవిచ్ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా కెరీర్‌లో 27వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గి అత్యధిక మాస్టర్స్ టైటిల్స్‌ను సాధించిన క్రీడాకారుడిగా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. |
Monday, April 4, 2016
మార్చి 18 - 24, 2016 కరెంట్ అఫైర్స్
Labels:
current affairs
Subscribe to:
Post Comments (Atom)
best website for current affairs.for daily epaper follow this link http://www.governmentjobstayari.com/
ReplyDelete