Monday, April 4, 2016

మార్చి 25 - 31, 2016 కరెంట్ అఫైర్స్

అంతర్జాతీయం
ఐరాస హక్కుల సలహాదారుగా భారతీయుడు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూన్‌హెచ్‌ఆర్సీ) ఆధ్వర్యంలో ‘మానవహక్కులు, బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు’ అనే అంశంపై పనిచేస్తున్న బృందానికి సలహాదారునిగా భారత సంతతి విద్యావేత్త సూర్యదేవా నియమితులయ్యారు. ఆయన్ను ఆసియా-పసిఫిక్ ప్రతినిధిగా యూన్‌హెచ్‌ఆర్సీ నియమించింది. దేవా ప్రస్తుతం హాంకాంగ్‌లోని ఓ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

లాహోర్‌లో ఆత్మహుతి దాడి: 69 మంది మృతి
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్‌లోని ఓ చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి బాంబు దాడిలో 69 మంది దుర్మరణం చెందారు. 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండే లాహోర్ టౌన్ ప్రాంతంలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ పార్క్ ప్రధాన గేటు వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
Current Affirs మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) మార్చి 30న ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్‌లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్‌లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. 2015 నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించింది.

జాతీయం
సొంతింటి కలకు చేయూత
‘2022 నాటికి ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు’ అమల్లో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మార్చి 23న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద మైదాన ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకి రూ. 1.20 లక్షలు, పర్వత, కఠిన ప్రాంతాల్లో నివసించే వారికి రూ.1.30 లక్షలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య విద్యుత్, బ్యాండ్‌విడ్త్ సరఫరా
Current Affirs భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా, ఆ దేశం నుంచి భారత్‌కు 10 జీబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్టవిటీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 23న ప్రారంభించారు. తాజా బ్యాండ్‌విడ్త్ కనెక్టవిటీతో తూర్పు భారత్‌కు ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడింది. ఇప్పటికే దేశంలో పశ్చిమ, దక్షిణ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ గేట్‌వేలు ఉన్నాయి.

అణురియాక్టర్ల ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
మహారాష్ట్రలోని జైతాపూర్ వద్ద నిర్మించనున్న ఆరు అణురియాక్టర్లకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్ దేశాలు మార్చి 22న న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, వాణిజ్య సంప్రదింపులన్నీ పూర్తి చేయాలని ఇరు దేశాలు గతంలోనే నిర్ణయించుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా సంస్థ(ఈడీఎఫ్) అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం పర్యటనలో భాగంగా దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్చి 27న నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంబంధిత ప్రకటనపై మార్చి 27న సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. మార్చి 18న అధికార కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 26న వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. మార్చి 18న సభలో ప్రభుత్వానికి బలం లేకపోయినప్పటికీ వివాదాస్పద పరిస్థితుల్లో స్పీకర్ ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించారని, ఇలాంటి తరుణంలో రావత్ ప్రభుత్వాన్ని కొనసాగించడం అనైతికమని, రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్రం తెలిపింది.

పఠాన్‌కోట్ ఘటనపై భారత్‌కు పాక్ విచారణ బృందం
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి ఘటనను విచారించేందుకు పాకిస్తాన్ నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సంయుక్త విచారణ బృందం (జిట్) మార్చి 27న ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకుంది. దేశంలో ఉగ్రదాడి ఘటనలకు సంబంధించి విచారణ కోసం విదేశీ అధికారులు భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. పఠాన్‌కోట్ ఘటనపై మనదేశానికి చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) కూడా విచారణ చేస్తోంది. పాక్ విచారణ బృందంతో పాటు ఎన్‌ఐఏ అధికారులు కూడా మార్చి 29న పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనున్నారు. ఉగ్రవాద నిరోధక ప్రత్యేక విభాగం పంజాబ్ చీఫ్ మహమ్మద్ అజీమ్ అర్షద్ పాకిస్తాన్ విచారణ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.

డిఫెక్స్‌పో ఇండియా - 2016 ప్రదర్శన
దక్షిణ గోవాలోని క్యూపెమ్ తాలూకా నకేరి క్విటోల్‌లో 9వ ‘డిఫెక్స్‌పో ఇండియా - 2016’ ప్రదర్శన మార్చి 28న ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేళ్లకోమారు నిర్వహించే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పలురకాల రక్షణ పరికరాలను, ఆయుధాలను ప్రదర్శిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రగతి మైదాన్‌లో నూతన కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తుండడంతో ఈసారి గోవాలో ఏర్పాటు చేశారు. డిఫెక్స్‌పోను 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే దేశ, విదేశీ కంపెనీల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 2014 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో నిర్వహించిన 8వ డిఫెక్స్‌పోలో 32 దేశాలకు చెందిన 232 కంపెనీలు, 58 దేశాలకు చెందిన 63 ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ప్రదర్శనలో 47 దేశాలకు చెందిన 1,035 కంపెనీలు పాల్గొంటున్నాయి. అమెరికా, రష్యా, యునెటైడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఈజిప్ట్, ఫిన్‌లాండ్, ఫ్రాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్, స్వీడన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు వీటిలో ఉన్నాయి. ఆసియాలో జరిగే అతిపెద్ద రక్షణ రంగ ప్రదర్శన ఇదే.

జాట్ల రిజర్వేషన్‌కు హరియాణా అసెంబ్లీ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జాట్లు, మరో ఐదు కులాలకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు హరియాణా అసెంబ్లీ మార్చి 29న ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జాట్ కులంతో పాటు జాట్ సిక్కు, రోర్, బిష్ణోయి, త్యాగీ, ముల్లా జాట్/ముస్లిం జాట్ కులాలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. హరియాణా వెనకబడిన వర్గాల (ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్) బిల్లు-2016, హరియాణా వెనకబడిన వర్గాల కమిషన్ బిల్లు-2016ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బిల్లులో బీసీ బ్లాక్ ఏ, బీసీ బ్లాక్ బీ, బీసీ బ్లాక్ సీలకు చట్టపరమైన హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి ఆమోదం తెలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ (రెడ్‌విత్ ఆర్టికల్ 31బి)లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మోదీ మూడు దేశాల పర్యటన
మూడు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 29వ తేదీ రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగే 13వ భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్‌కు వెళ్తారు. మార్చి 31, ఏప్రిల్ 1న అక్కడ జరిగే ‘అణు భద్రతా సదస్సు’లో పాల్గొంటారు. అనంతరం సౌదీ అరేబియాకు వెళ్తారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో సౌదీలో మోదీ పర్యటన సాగుతుంది.

రైలు టిక్కెట్టు రద్దుకు ‘139’
ప్రయాణికులు రైలు టిక్కెట్టును రద్దు చేసుకోవడానికి భారతీయ రైల్వే శాఖ 139 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రైల్ టిక్కెట్టు రద్దుకు 139కి కాల్‌చేసి వివరాలు చెప్తే వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) పొందవచ్చు. అదే రోజు కౌంటర్ వద్ద ఓటీపీ వివరాలు చెప్పి టిక్కెట్టు డబ్బులు తిరిగి పొందవచ్చు.

రాష్ట్రీయం
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో వైఫై
ఆన్‌లైన్ ద్వారా ధరలను కోట్ చేసి పంటలను కొనుగోలు చేసేందుకు తెలంగాణలో 44 వ్యవసాయ మార్కెట్లను ఎంపిక చేశారు. వీటిలో వైఫై సౌకర్యం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసే ‘జాతీయ నెట్‌వర్క్ ఏర్పాటు’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా తొలి దశలో తెలంగాణలోని ఐదు పెద్ద మార్కెట్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు.

రాజధాని భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ‘ఫుమిహికో మకి అసోసియేట్స్’
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా జపాన్‌కు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్ ఎంపికైంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మార్చి 25న ప్రకటించారు. మకి అసోసియేట్స్ ఐకానిక్ కట్టడాలుగా గుర్తించిన అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలకు తుది డిజైన్లను రూపొందిస్తుంది. మిగిలిన కట్టడాలకు సంబంధించి మార్గదర్శకాలను అందజేయనుంది.

బంగ్లాదేశ్ నుంచి కృష్ణపట్నం నౌక సేవలు ప్రారంభం
బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత మార్చి 28న వాస్తవ రూపం దాల్చింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి. హార్బర్ నౌక మార్చి 23న బయలుదేరి 28న కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్‌గాన్ రేవుకు పంపుతున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 28న లాంఛనంగా ప్రారంభించారు. ఏడాది లోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేశామని ఆయన చెప్పారు. పట్టిసీమ వద్ద 200 ఎకరాల భూమిని మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇస్తామని, ఆ భూమిలో గార్డెన్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి గుడికి సీఎం రూ.70 లక్షలు మంజూరు చేశారు.

హైదరాబాద్‌లో అమెజాన్ భారీ క్యాంపస్
Current Affirs అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సంస్థ హైదరాబాద్‌లో భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ, ఐటీఈఎస్ సెజ్ వద్ద నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు మార్చి 30న శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా. అమెజాన్ క్యాంపస్ కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో భారత్‌తో పాటు అంతర్జాతీయ కార్యకలాపాలకు బ్యాక్ ఆఫీస్‌గా ఉండటం కోసం రూ.1,400 కోట్లతో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అమెరికా తరువాత అమెజాన్ సంస్థకు ఇదే అతి పెద్ద కేంద్రం కావడం గమనార్హం.

ఆర్థికం
కరెన్సీ నోటుకు స్వదేశీ కాగితం
Current Affirs మన కరెన్సీ నోటు ముద్రణకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారుచేసుకోనున్నాం. దీని వల్ల వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు సంబంధించిన కాగితపు పరిశ్రమను ప్రారంభించింది. ఏడాదికి 12 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కాగిత పరిశ్రమ ఏర్పాటుతో ఏడాదికి రూ.1,280 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని బీఆర్‌బీఎన్‌ఎంఎల్ డెరైక్టర్ జగన్మోహన్ తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ
భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్
ఏటా దేశంలో లక్షల మంది పిల్లల ప్రాణాలను బలిగొంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం కీలకచర్య తీసుకుంది. భువనేశ్వర్‌లో మార్చి 26న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రోటా వైరస్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పోగ్రామ్ (యూపీఐ)లో భాగంగా.. పోలియో, మశూచి, రోటా వైరస్, అడల్ట్ జపనీస్ ఎన్సెఫిలిటీస్ వ్యాధులకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. రోటా వైరస్ వ్యాక్సిన్ టీకాను తొలి విడతలో.. ఏపీ, ఒడిశా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు.

తెలంగాణ రవాణ శాఖ ‘ఎం-వాలెట్’ యాప్
Current Affirs దేశంలోనే తొలిసారిగా రవాణాకు సంబంధించిన డాక్యుమెంట్లతో తెలంగాణ రవాణా శాఖ ఓ మొబైల్ వాలెట్ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ ఆర్‌టీఏ ఎం-వాలెట్ యాప్‌ను మార్చి 30న ఆవిష్కరించారు. పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మొబైల్‌లో ఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను వారికి చూపించవచ్చు. ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లెసైన్స్‌ను ఈ యాప్‌లో భద్రపరచుకోవచ్చు. దీని కోసం అన్ని రకాల ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లలో ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్ ఆవిష్కరణ
బెల్జియం సాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్(ఎరీస్)’ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ కలసి రిమోట్‌తో ఆవిష్కరించారు. 3.6 మీటర్ల వెడల్పుగల ప్రాథమిక కటకం ఉన్న టెలిస్కోప్‌ను ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు దగ్గరలోని దేవస్థల్ వద్ద నిర్మించారు. అయితే ప్రస్తుతం బెల్జియం పర్యటనలో ఉన్న మోదీ బ్రసెల్స్ నుంచి ఆ దేశ ప్రధానితో కలసి ఈ టెలిస్కోప్‌ను ప్రారంభించారు. అంతకు ముందు ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై మోదీ, చార్లెస్ చర్చించారు. బ్రసెల్స్‌లో మార్చి 22న జరిగిన ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళులర్పించారు. ఆత్మాహుతి దాడి జరిగిన మాల్‌బీక్ మెట్రో స్టేషన్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు.

వార్తల్లో వ్యక్తులు
ఇంటెల్ సంస్థ మాజీ చైర్మన్ గ్రోవ్ మృతి
ఇంటెల్ సంస్థను ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ చిప్ సంస్థగా తీర్చిదిద్దిన ఆండ్రేవ్ గ్రోవ్ (76) మార్చి 22న అమెరికాలో మృతి చెందారు. 1968లో ఇంటెల్ సంస్థను ప్రారంభించిన తర్వాత ఆ సంస్థలో చేరిన తొలి వ్యక్తి గ్రోవ్. ఆయన పరిశోధనలు, ఉత్పత్తిలో పాల్గొనడంతో పాటు 2014 వరకు ఇంటెల్ చైర్మన్‌గా వ్యవహరించారు. టైమ్ పత్రిక 1997లో ఆండ్రేవ్ గ్రోవ్‌ను మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది.

బోస్నియా సెర్బె మాజీ నాయకుడు రాదోవన్ కరద్‌జిక్‌కు 40 ఏళ్లు శిక్ష
బోస్నియా సెర్బె మాజీ నాయకుడు రాదోవన్ కరద్‌జిక్‌కు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ మార్చి 24న 40 ఏళ్ల శిక్ష విధించింది. 1995లో సెర్బెనికా రాష్ట్రంలో జరిగిన 8,000 మంది ముస్లింల ఊచకోత ఘటన కు సంబంధించి కోర్టు కరద్‌జిక్‌ను నిందితునిగా తేల్చింది.

ఆనందగజపతిరాజు కన్నుమూత
విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి ఆనంద గజపతిరాజు (66) మార్చి 26న కన్నుమూశారు. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆనంద్‌గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. 1950 జూలై 17న విజయనగరం మహారాజు పి.వి.జి.రాజు, కుసుమ గజపతి ప్రథమ సంతానంగా జన్మించిన ఈయనకు సోదరుడు అశోక్ గజపతిరాజు, సోదరి సునీతాదేవి ఉన్నారు. గ్వాలియర్‌లో స్కూల్ విద్యాభ్యాసం కొనసాగగా.. మద్రాస్ లయోలాలో కళాశాల, అమెరికా స్టెట్సన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. హ్యూమనిస్టిక్ స్టడీస్ అంశంలో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇంటర్ అమెరికన్ యూనివర్సిటీ 2003లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో ఆంధ్రా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ అందుకున్నారు. ‘రాజకీయ అర్థశాస్త్రంలో దారితప్పిన ఆలోచనలు’ అనే పుస్తకాన్ని 2014లో రాశారు.

‘గిన్నిస్’లో గాన కోకిల పి.సుశీల
Current Affirs ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 2016 జనవరి 28 నాటికి ధ్రువీకరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి ఆరుకు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారని గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు. 1952లో తమిళ చిత్రం ‘పెట్రతాయి’ (తెలుగులో ‘కన్నతల్లి’) ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన సుశీల ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ గీతాలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. ఈమెకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి. ఇప్పటికి ఐదు సార్లు ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఆమెను జాతీయ అవార్డులు వరించాయి.

అవార్డులు
పద్మ అవార్డులు ప్రదానం
Current Affirs వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 28న పద్మ అవార్డులను అందించారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూబాయి అంబానీ తరపున ఆయన భార్య కోకిలాబెన్ పురస్కారాన్ని అందుకున్నారు. అంబానీతో పాటు ఆర్థికవేత్త అవినాశ్ కమలాకర్ దీక్షిత్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్, ప్రఖ్యాత నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తిలకు పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. పద్మభూషణ్ అందుకున్న వారిలో పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, సైనా నెహ్వాల్, ప్రముఖ ఉదరకోశ వైద్య నిపుణుడు డాక్టర్ జి.నాగేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, పకృతి వ్యవసాయ వేత్త సుభాష్ పాలేకర్, ప్రముఖ వైద్యుడు యార్లగడ్డ నాయుడమ్మ తదితరులు.. పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 44 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రీహ తల్లో ఎనిమిది మంది తెలుగువారున్నారు.

జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి
తొలిసారి తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 2015కి గానూ మార్చి 28న ప్రకటించిన 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాహుబలి ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో కలిపి మొత్తం రెండు అవార్డును సొంతం చేసుకుంది. దీంతో 1953 నుంచి ప్రకటిస్తున్న ఈ అవార్డుల్లో.. ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్న తొలి తెలుగు సినిమాగా బాహుబలి నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా కంచె సినిమా ఎంపికైంది. హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీకి మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.

  • ఉత్తమ చిత్రం: బాహుబలి
  • ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (చిత్రం: పికు)
  • ఉత్తమ నటి: కంగనా రనౌత్ (చిత్రం: తను వెడ్స్ మను రిటర్న్స్)
  • ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా బన్సాలీ (చిత్రం: బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ జాతీయ సమైక్యతా పురస్కారం: నానక్ షా ఫకీర్
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయిజాన్

క్రీడలు
హాకీ ఇండియా ఉత్తమ క్రీడాకారులుగా శ్రీజేష్, దీపిక
Current Affirs
హాకీ ఇండియా 2015 వార్షిక అవార్డులను మార్చి 26న బెంగళూరులో ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారులకు రూ.25 లక్షల నగదు బహూకరించారు.
  • ఉత్తమ క్రీడాకారుడు: పి.ఆర్. శ్రీజేష్
  • ఉత్తమ క్రీడాకారిణి: దీపిక
  • మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం: దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్ (రూ.30 లక్షల నగదు, ట్రోఫీ)
  • ఇన్‌వాల్యుబుల్ కంట్రిబ్యూషన్: బల్‌దేవ్ సింగ్
  • అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్: మధ్యప్రదేశ్ హాకీ అకాడెమీ

ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్ యోహాన్ క్రాఫ్ మృతి
నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు యోహాన్ క్రాఫ్ (68) క్యాన్సర్‌తో మార్చి 24న మరణించారు. క్రాఫ్.. 1974లో నెదర్లాండ్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆయన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అందుకోవడంతో పాటు మూడుసార్లు యూరోపియన్ కప్ గెలిచిన నెదర్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు.

టి20 ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐసీసీ అంతర్జాతీయ టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఐసీసీ టి20 ప్రపంచకప్ టోర్నీకి ముందు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ను వెనక్కినెట్టిన కోహ్లి (871 పాయింట్లు) అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రి టాప్‌కు చేరుకున్నాడు. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. జడేజా ఏడు, బుమ్రా 13వ స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ టి20లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.

No comments:

Post a Comment